

తాజాగా భారీ ఉగ్రకుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. పాక్ ఐఎస్ఐతో పాటు బంగ్లాదేశ్ అతివాద సంస్థలతో సంబంధాలున్న 8 మందిని అరెస్టు చేశారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో ఏకకాలంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. భారత్‌లో భారీ ఉగ్రదాడికి వీళ్లు ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విదేశీ హ్యాండ్ల ఆధ్వర్యంలో భారత్‌లో వీళ్లు ఉగ్రకార్యకలాపాలు సాగిస్తున్నట్టు పోలీసులు ఆదివారం తెలిపారు.
తమిళనాడులోని తిరుప్పుర్ జిల్లాలో మిజనూర్ రహమాన్, మొహమ్మద్ షబాత్, ఉమర్, మొహమ్మద్, లిటన్, మొహమ్మద్ షాహిద్, మొహమ్మద్ ఉజ్జల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరిని పశ్చిమబెంగాల్‌లో అరెస్టు చేశారు. నిందితుల్లో కొందరు బంగ్లాదేశీయులని పోలీసులు తెలిపారు. ఎవరికీ అనుమానం రాకుండా వారు నకిలీ ఆధార్ కార్డులను వినియోగించారని పేర్కొన్నారు. నిందితుల నుంచి 8 మొబైల్ ఫోన్లు, 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
ఉగ్రవాద చర్యలకు సంబంధించి ఆన్‌లైన్ పోస్టులపై దర్యాప్తు జరుపుతుండగా నిందితుల గురించి తెలిసిందని పోలీసులు తెలిపారు. తమిళనాడులోని ఓ దుస్తుల్లో ఈ ఆరుగురు పనిచేస్తున్నట్లు తెలిపారు. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కర్-ఏ-తయ్యబా భారత్‌లో దాడులను ప్లాన్ చేస్తున్నట్టు శనివారం నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఢిల్లీ సహా పలు ప్రాంతాల వారు దాడులకు సిద్ధమైనట్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తాజాగా ఉగ్రకుట్రను భగ్నం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
