

విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో డైరెక్టర్ ఒకరు తన పదవికి రాజీనామా చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆయన వేరే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఇక్కడికి వచ్చారు. విధుల్లో భాగంగా పలు కార్యక్రమాలను పరిశీలించినప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడి యాజమాన్యం కొన్ని ఏకనిర్ణయాలను అమలు చేస్తున్నట్టు పేర్కొంది. ఈ పరీక్ష సంస్థలో ముఖ్య అధికారి దృష్టికి తీసుకువెళ్లగా, పూర్తిస్థాయి సీఎండీ వచ్చాక అన్ని నిర్ణయాలు తీసుకుంటారని, అంతవరకు యథావిధిగా నడిపించాలని సూచించినట్లు సమాచారం.
మరో మూడు నెలల వరకు కొత్త సీఎం వచ్చే అవకాశం లేదని, భవిష్యత్తులో ఉద్యోగ సంఘాలకు అనుకూలంగా కోర్టు ఏ తీర్పు ఇచ్చినా దాని పర్యవసానాలు అనుభవించాల్సి ఉంటుందని ఆలోచించిన ఆ డైరెక్టర్.. తన రాజీనామాకు పంపినట్లు తెలిసింది. ఆ ఫైల్ విజిలెన్స్ విభాగం విచారణకు కూడా వెళ్లినట్టు ప్లాంటులో ప్రచారం జరుగుతోంది. ఆర్‌ఐఎన్‌ఎల్ వెబ్‌సైట్‌లో అందరి డైరెక్టర్ల ఫొటోలు, పేర్లు ఉండగా, ఆ ఒక్క డైరెక్టర్ వివరాలు లేకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అయితే ప్లాంటు అధికార వర్గాలు అలాంటిదేమీ లేదని చెబుతున్నారు.
