
.webp)
గాంధీల కుటుంబానికి మనమంతా ఒక చేయి వేసి వెయ్యి కోట్ల రూపాయలు విరాళంగా ఇద్దాం. ఇదీ ఇటీవల రేవంత్ చేసిన కామెంట్. ఇంతకీ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, సోనియాగాంధీకి ఉన్న ఆస్తులన్నీ అని చూస్తే.. వీరు అఫిడవిట్లలో దాఖలు చేసిన అధికారిక లెక్కల ప్రకారం, సుమారు ఈ మొత్తం విలువ 45 నుంచి యాభై కోట్ల వరకూ మాత్రమే ఉంటుంది. ఇక విడివిడిగా వీరి ఆస్తుల విలువ ఎంతో గమనిస్తే.. రాహుల్ గాంధీ రూ.20 కోట్లు, సోనియా గాంధీ రూ.12 కోట్లు, ప్రియాంక గాంధీకి మరో పన్నెండు కోట్లు మాత్రమే ఉన్నట్టు అఫిడవిట్లలో కనిపిస్తోంది.
ఇక పార్టీకున్న నిధులు ఫిక్స్ డ్ డిపాజిట్లు, నేషనల్ హెరాల్డ్‌కి ఉన్న ఆస్తుల విలువ ఎంతని గమనిస్తే.. ఈ మొత్తం సుమారు రూ.3500 కోట్లుగా ఉంది. ఇందులో వివాదాస్పద నేషనల్ హెరాల్డ్ దే 2 కోట్లకు పైగా ఆస్తులున్నట్టు గుర్తించారు. ఇవన్నీ ఏడీఆర్ నివేదిక ప్రకారం చెబుతున్న గణాంకాలు. వారే అధికారికంగా ప్రకటించిన విలువలు. ఒక్క 2023-24లో పార్టీకి వచ్చిన మొత్తం ఆదాయం సుమారు రూ.1,045 కోట్లుగా ఉంది.
ఇక దేశంలోనే అత్యంత ధనవంతమైన పార్టీ బీజేపీ. ఈ పార్టీ మొత్తం నిధుల విలువ ఏడీఆర్ లెక్కల ప్రకారం పది వేల కోట్లకు పై మాట. ఆ తర్వాతి స్థానంలో తృణముల్ కాంగ్రెస్ సుమారు 1600 కోట్లు, అటు పిమ్మట భారత రాష్ట్ర సమితి దాదాపు 1200 కోట్లతో అత్యంత ఆర్థిక పరిపుష్టితో కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఏమంత తక్కువ ఆదాయంతో లేదు.
కాంగ్రెస్‌కి ఊరూరా ఉన్న పార్టీ కార్యాలయాలు ఇతర ఆస్తుల విలువ ఎంత ఉండొచ్చు? కాంగ్రెస్ లోనే అత్యధిక ధనవంతులైన లీడర్లు ఎవరు? రేవంత్ రెడ్డి ఆస్తులెన్ని? అని గమనిస్తే.. కాంగ్రెస్ కి దేశ వ్యాప్తంగా ఉన్న భవనాల విలువ రూ.400- 500 కోట్లుగా సూచించింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్‌లోనే అత్యధిక ధనవంతుల జాబితాలో డీకే శివకుమార్, పుట్టస్వామిగౌడ్ అనే కర్ణాటక నేతలు కనిపిస్తారు. వీరి ఆస్తుల విలువ అధికారిక లెక్కల ప్రకారం చెరో వెయ్యి కోట్లకు పైగా ఉంటుంది.
ఇక తెలంగాణలో కాంగ్రెస్ నుంచి అత్యధిక ధనవంతుల జాబితా ప్రకారం చూస్తే మంత్రి వివేక్ ఆస్తులు రూ.600 కోట్లు ఉన్నాయి. ఆపై రాజగోపాల్ రెడ్డి ఆస్తుల విలువ సుమారు రూ.400 కోట్లకు పైగా ఉంది. రేవంత్ ఏడీఆర్ గణాంకాలను బట్టి కేవలం రూ.30 కోట్లుగా మాత్రమే ఆస్తుల విలువ. అయితే ఇవన్నీ ఓపెన్‌లో చాలా పెద్ద ఎత్తున ఉండే అవకాశ ముంది.
ఇదిలా ఉంటే రేవంత్ వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి గాంధీ కుటుంబానికి పంపుతాం.. అన్నది తప్పుడు సంకేతాలను జానాల్లోకి తీస్కెళ్తుందన్న మాట వినిపిస్తోంది. ఇప్పుడే కాదు వైయస్ జమానా నుంచి ఈ మాట చెలామణిలో ఉంది. దానికి తోడు కాంగ్రెస్ పార్టీపై సూట్కేసుల సంస్కృతి ఉంది. వీరు ఢిల్లీకి వెళ్లేదే సూట్కేసులు అందివ్వడానికి అన్న టాక్ ఉంది. వీటన్నిటి దృష్ట్యా చూస్తే రేవంత్ చేసిన ఈ కామెంట్ ని ప్రత్యర్ధి పార్టీలు పట్టుకునే అవకాశముందని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
