
డిసెంబర్ 29, 2025 7:33PMన పోస్ట్ చేయబడింది

సికింద్రాబాద్ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడిగా, వికలాంగుల సంస్థ చైర్మన్ పిన్నమనేని సాయిబాబు ఆకస్మిక మృతి పట్ల టీడీపీ నేత నందమూరి రామకృష్ణ సంతాపం ప్రకటించారు. నిన్న తెల్లవారుజామున హైదరాబాద్లోని ఆయన నివాసంలో అకస్మాత్తుగా మృతి చెందడం అభిమానులు, కార్యకర్తలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. సాయిబాబు మృతి యావత్ తెలుగుదేశం పార్టీ వీరసైన్య కార్యకర్తలను, ఎన్టీఆర్ అభిమానులను తీవ్ర విషాదంలో ముంచింది.
ఆయన మరణం అటు అభిమానులకు, ఇటు పార్టీ కార్యకర్తలకు తీరని లోటుగా మారింది. అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొలినాళ్ల నుంచే పసుపు జెండాను భుజాన మోసిన మొట్టమొదటి వీరసైన్య కార్యకర్తలలో సాయిబాబు ఒకరు. ఎన్నో కష్టాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా ముందుండి పార్టీని నడిపించారు. ఒక నిబద్ధమైన అభిమానిగా, అంకితభావంతో కూడిన కార్యకర్తగా ఎన్టీఆర్కు, తెలుగుదేశం పార్టీకి ఆయన అందించిన సేవలు మరువలేనివి.
పిన్నమనేని సాయిబాబుకు ఘన నివాళులు అర్పిస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరపున, మా కుటుంబం తరపున ఆయన కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. పసుపు కార్యకర్తలు, అభిమానుల హృదయాల్లో సాయిబాబు జ్ఞాపకాలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయిని రామకృష్ణ తెలిపారు.