
డిసెంబర్ 27, 2025 3:45PMన పోస్ట్ చేయబడింది
.webp)
తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైందా? రేపో మాపో రేవంత్ కెబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయనున్నారా? అన్న చర్చ తెలంగాణ రాజకీయాలలో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం రేవంత్ హస్తిన పర్యటకు బయలుదేరనున్నారు. శనివారం (డిసెంబర్ 28) హస్తినలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ పెద్దలతో భేటీ అవుతారు. ఈ భేటీ ప్రధాన అజెండా మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ అంటున్నారు. ప్రస్తుతం రేవంత్ కేబినెట్‌లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి.
అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే వారికి మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఇక బీసీ కోటాలో ఆది శ్రీనివాస్, ఎస్టీ కోటాలో బాలు నాయక్ లూ రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో కేవలం కేబినెట్ విస్తరణ కాకుండా పునర్వ్యవస్థీకరణకు అనుమతి ఇవ్వడానికి హైకమాండ్ ను కోరనున్నారు. ఇందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. మార్పులు, చేర్పులతో కేబినెట్ ను పున్వ్యవస్థీకరించి కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాలని ముఖ్యమంత్రి కోరుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
