

తారాగణం: ఆది సాయికుమార్, అర్చన అయ్యర్, రవివర్మ, స్వాసిక విజయ్, మధునందన్, లక్ష్మణ్ మీసాల, షిజు మీనన్, శివకార్తీక్ నిర్వహిస్తున్నారు.
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
డీఓపీ: ప్రవీణ్ కె బంగారి
ఎడిటింగ్: శ్రావణ్ కటికనేని
రచన, దర్శకత్వం: యుగంధర్ ముని
నిర్మాతలు: రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి
బ్యానర్: షైనింగ్ పిక్చర్స్
విడుదల తేదీ: డిసెంబర్ 25, 2025
ప్రేమ కావాలి, లవ్లీ వంటి విజయవంతమైన సినిమాలతో కెరీర్ ప్రారంభించిన ఆది సాయికుమార్.. సరైన విజయం కోసం కొన్నేళ్లుగా నిలిచాడు. ఆ ఎదురుచూపులకు తెర దించే సినిమా ‘శంబాల’ అవుతుందని నమ్మకం పెట్టుకున్నాడు. ప్రేక్షకుల దృష్టి కూడా ఈ సినిమాపై పడింది. మరి ‘శంబాల’ ఎలా ఉంది? ఆది ఖాతాలో హిట్ పడేలా ఉందా? (శంభాల మూవీ రివ్యూ)
కథ:
శంబాల అనే మారుమూల గ్రామంలో ఆకాశం నుండి ఒక ఉల్క వచ్చి పడుతుంది. అప్పటి నుంచి ఆ ఊరిలో అన్నీ అనర్ధాలు జరుగుతుంటాయి. దీంతో ఊరి ప్రజలు.. ఆ ఉల్కని బండ భూతంగా భావించూ.. భయంతో వణికిపోతుంటారు. స్వామీజీల సహాయంతో దీని నుంచి బయటపడే మార్గాన్ని అన్వేషించే పనిలో పడతారు. స్వామిజీ సూచనతో.. పాలకు బదులుగా రక్తాన్ని ఇస్తున్న ఆవుని చంపేయడానికి కూడా సిద్ధపడతారు. మరోవైపు యువ శాస్త్రవేత్త అయిన విక్రమ్(ఆది) ఆ ఉల్కపై పరిశోధన చేయడం ప్రభుత్వం తరపున అక్కడికి వస్తాడు. శాస్త్రాలు అబద్ధం, సైన్స్ మాత్రమే నిజమని నమ్మే నాస్తికుడైన విక్రమ్.. ఆ ఊరి వాళ్ళ నమ్మకాన్ని, భయాన్ని మూఢనమ్మకాలుగా కొట్టిపారేస్తాడు. స్వామీజీల పూజలను కూడా అడ్డుకుంటాడు. ఈ ఉందినే ఊరి వాళ్ళ ఆగ్రహానికి కారణం. మరోవైపు ఊరిలో వరుస హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దీంతో ఊరి ప్రజలంతా కలిసి విక్రమ్ ని చంపడానికి కూడా సిద్ధపడతారు. అప్పుడు విక్రమ్ ఏం చేశాడు? శంబాల గురించి అతను తెలుసుకున్న నిజం ఏంటి? ఈ కథలో దేవి(అర్చన అయ్యర్) పాత్ర ఏంటి? వరుస మరణాల వెనకున్న శక్తి ఏంటి? దాని నుంచి విక్రమ్, ఊరిని ఎలా కాపాడగలిగాడు? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
శంబాల టీజర్, ట్రైలర్ చూసినప్పుడే.. మంచి కంటెంట్ ఉన్న హారర్ థ్రిల్లర్ ఫిల్మ్ చూడబోతున్నామనే ఫీలింగ్ కలిగింది. అందుకు తగ్గట్టుగానే సినిమా ఆసక్తికరంగా ఉంది. శివుడు అంధకాసురుడిని సంహరించే సన్నివేశాలతో సినిమాని ప్రారంభించి.. అసలు ఈ కథకి పురాణాలతో సంబంధం ఏంటంటే క్యూరియాసిటీని కలుగజేయడంలో సక్సెస్ అయ్యారు.
శంబాల ఊరిలో ఉల్క పడటం, ఒక ఆవు పాలకు బదులుగా రక్తం ఇవ్వడం, ఆవు యజమాని రాములు(రవి వర్మ) వింతగా ప్రవర్తించడం వంటి సన్నివేశాలతో.. ప్రేక్షకులను మొదటి నుంచే కథలో ఇన్వాల్వ్ అయ్యేలా చేయగలిగారు. ఈ విధంగా వచ్చే హారర్ ఎపిసోడ్ కూడా బాగుంది. అయితే కెమెరా, ఎడిటింగ్ విభాగం పనితీరు ఇంకా మెరుగ్గా ఉంటే.. ఆ ఎపిసోడ్ మరింత ఎఫెక్టివ్‌గా ఉండేది.
ఉల్క గురించి పరిశోధన చేయడానికి నాస్తికుడైన విక్రమ్ గా ఆది ఎంట్రీ ఇవ్వడం బాగుంది. గ్రామ ప్రజలకు, ఆదికి మధ్య సన్నివేశాలను కూడా బాగానే రాసుకున్నారు. అయితే దేవి ట్రాక్ ని మాత్రం ఇంకా బెటర్ గా రాసుకొని ఉండాల్సింది. నిజానికి ఆ పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, కానీ సన్నివేశాల్లో అది కనిపించదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఆ పాత్ర ప్రేక్షక పాత్ర వహించినట్లుగానే అనిపిస్తుంది.
ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే అదృశ్య శక్తి కారణంగా రాములు(రవి వర్మ), కృష్ణ(లక్ష్మణ్ మీసాల) వింతగా ప్రవర్తించడం, ఈ ఫీచర్ వచ్చే సన్నివేశాలు మెప్పించాయి. దానితో కథనం ఆసక్తికరంగా మారుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ ఆకట్టుకుంది.
ఫస్ట్ హాఫ్ తో ప్రస్తుత సెకండాఫ్ త్వరగా అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. కథనంలో కూడా కాస్త వేగం కనిపిస్తుంది. అయితే కొన్ని సీన్స్ రిపీటెడ్ గా అనిపిస్తాయి. అలాగే, పతాక సన్నివేశాలను కూడా ఇంకా బెటర్ గా రాసుకొని ఉండాల్సింది. ఆది-పాప మధ్య బాండింగ్ ని మరింత ఎఫెక్టివ్ గా చూపించినట్లైతే.. క్లైమాక్స్ కి ఆడియన్స్ ఇంకా ఎక్కువ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యుండేవారు.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
శాస్త్రవేత్త విక్రమ్ పాత్రలో ఆది చక్కగా ఒదిగిపోయాడు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ లో బాగా రాణించాడు. ఈ కథను నమ్మి, ఒక నటుడిగా తాను ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు. దేవి పాత్రకు తగ్గట్టుగా అర్చన అయ్యర్ కనిపించిన తీరు మెప్పించింది. అయితే రచన ప్రభావవంతంగా లేకపోవడంతో.. ఆ పాత్ర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. తన సీనియారిటీతో రాములు పాత్రకు న్యాయం చేశాడు రవివర్మ. ఇక కృష్ణగా లక్ష్మణ్ మీసాల మరోసారి సర్ ప్రైజ్ చేశాడు. అతను ఇచ్చిన కొన్ని ఎక్స్ ప్రెషన్స్ థియేటర్స్ లో విజిల్స్ పడేలా ఉన్నాయి. కానిస్టేబుల్ హనుమంతుగా మధునందన్ ఆకట్టుకున్నాడు. హనుమంతు కూతురిగా నటించిన అమ్మాయి కూడా బాగా చేసింది. స్వాసిక విజయ్, శివకార్తీక్, అన్నపూర్ణ, షిజు మీనన్, శైలజ ప్రియ, హర్ష వర్ధన్, ఇంద్రనీల్ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
శ్రీ చరణ్ పాకాల నేపథ్యం సంగీతం ఆకట్టుకుంది. చాలా సీన్స్ ని తన మ్యూజిక్ తో బాగానే ఎలివేట్ చేశాడు. హారర్ థ్రిల్లర్ జానర్ కి తగ్గట్టుగా ప్రవీణ్ కె బంగారి కెమెరా పనితనం మెప్పించింది. అయితే కొన్ని షాట్స్ మాత్రం ఇంకా ఎఫెక్టివ్ గా తీయొచ్చు అనిపించింది. ఎడిటింగ్ లోపం కూడా కొన్ని చోట్ల ఆ ఫీలింగ్ కలగడానికి కారణమైంది. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ ని ట్రిమ్ చేయవచ్చు. ఆర్ట్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు బాగా ఉన్నాయి.
ఫైనల్ గా…
రైటింగ్ పరంగా, టెక్నికల్ గా చిన్న చిన్న లోపాలు.. ఓవరాల్ గా మాత్రం సినిమా మెప్పిస్తుంది. ముఖ్యంగా ఆదికి ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పవచ్చు. గత కొన్నేళ్లలో ఆది నుంచి వచ్చిన బెస్ట్ ఫిల్మ్ ఇది అనడంలో డౌట్ లేదు. ఈ సినిమా భయపెడుతుంది, థ్రిల్ ని పంచుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుందంటే క్యూరియాసిటీని కలిగిస్తుంది. హారర్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వారికి ‘శంబాల’ నచ్చుతుంది.
రేటింగ్: 2.75/5
నిరాకరణ: ఈ సమీక్షలో వ్యక్తీకరించబడిన వీక్షణలు సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయాలు మరియు సంస్థ ఎటువంటి బాధ్యత వహించదు. ఈ సమీక్షకు వ్యాఖ్యానించడానికి లేదా ప్రతిస్పందించడానికి ముందు వీక్షకుల విచక్షణతో సలహా ఇవ్వబడుతుంది.
