
నవంబర్ 26, 2025 5:31AMన పోస్ట్ చేయబడింది

నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో చిచ్చు రేగింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ నియామకం రచ్చ రేపింది. నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా పున్నా కైలాష్ నేత నియామకంపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర అసంతృప్తి, అసహనం, ఆగ్రహం వ్యక్తం చేయడంతో జిల్లాలో విభేదాలు బయటపడ్డాయి. తనపైనా, తన కుటుంబంపైనా అసభ్య పదజాలంతో దూషిస్తూ మీడియాకు ఎక్కిన పున్నా కైలాష్ నేతను డీసీసీ అధ్యక్షుడిగా ఎలా నియమిస్తారంటూ మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను, తన కుటుంబాన్ని అసభ్య పదజాలంతో దూషించిన పున్నా కైలాష్ నేతపై పోలీసు కేసు పెడతానంటూ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు కోమటిరెడ్డి. పున్నా కైలాష్ నేతను డీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి, అర్హులైన వారిని నియమించాలని డిమాండ్ చేశారు.
ఇలా కోమటిరెడ్డి వ్యవహారశైలిపై జిల్లా కాంగ్రెస్‌లో ఉండగా మంత్రివర్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయితే ఓర్వలేకపోతున్నారని మండిపడుతున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనే తీవ్ర విమర్శలు చేసిన ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజశేఖరరెడ్డి ఎమ్మెల్యే పదవి నుంచి, పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో నల్గొండ జిల్లాలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి.
కోమటిరెడ్డి బ్రదర్స్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారిద్దరూ అందరిపైనా నోరు పారేసుకుంటారనీ, ఇతరులెవరికీ పదవులు దక్కకుండా కుట్రలు చేయడం, బెదరింపులకు దిగడం వారికి అలవాటుగా మారిందని దుయ్యబడుతున్నాయి. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా కాంగ్రెస్ రేగిన చిచ్చును పార్టీ అధిష్ఠానం ఎలా చల్లారుతుందోనన్న చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.
