
అక్టోబర్ 18, 2025 7:46AMన పోస్ట్ చేయబడింది

మంత్రి నారాయణ, పిఠాపురం తెలుగుదేశం ఇన్ చార్జ్ వర్మ మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. ఇటీవల ఒక కార్యక్రమంలో మంత్రి నారాయణ పిఠాపురంలో వర్మను జీరో చేసేశామని వ్యాఖ్యానించారంటూ, అందుకు సంబంధించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ ఆడియోపై స్పందించిన వర్మ కూడా ఒకింత ఘాటుగా నిలిచాడు. ఎవరో ఏదో అన్నంత మాత్రాన తాను జీరో కానని అన్నారు. అయితే ఈ వివాదం టీకప్పులో తుపాను మాదిరిగా తేలిపోయింది.
మంత్రి నారాయణ తాను టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడిన మాటలను ఎవరో ఎడిట్ చేసి, కట్ చేసి , పేస్ట్ చేసి తాను వర్మ విషయంలో ఏమో మాట్లాడినట్లు తప్పుడు ప్రచారానికి ప్రదర్శించారని క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే విశాఖ పర్యటనకు వచ్చిన మంత్రి నారాయణను వర్మ కలిశారు. ఈ సందర్భంగా ఆ వీడియోపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. మంత్రి నారాయణ క్లారిటీ ఇవ్వడంతో వర్మ సంతృప్తి చెందారు. దీంతో వివాదం సమసింది. కాగా మంత్రి నారాయణ తాను ఆ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడినదంతా బహిర్గతం చేసి ఉంటే వక్రీకరణ ఎలా జరిగిందో, తాను అనని మాటలను అన్నట్లుగా ఎలా సృష్టించారో అర్ధమయ్యేదని వివరించారు.
అని మాటలను అన్నట్లుగా వక్రీకరించి మా మధ్య విభేదాలు సృష్టించడం ఎవరి వల్ల సాధ్యం కాదని నారాయణ చెప్పారు. ఇక వర్మ వివాదం లేదని ప్రకటించడమే కాకుండా, పిఠాపురంలో తెలుగుదేశం, జనసేన మధ్య విభేదాలు లేవనీ, రెండు పార్టీలూ సమన్వయంతో పని చేస్తున్నాయనీ అన్నారు. ఈ సందర్భంగా మర్మ చంద్రబాబు ఆగమంటే ఆగుతాను.. దూకమంటే దూకుతానని చెప్పారు. మంత్రి నారాయణ తన గురించి ఏవో వ్యాఖ్యలు చేశారంటూ అభూత కల్పనలు ప్రచారం చేశారనీ, అటువంటి అసత్య ప్రచారాలను తాను పట్టించుకోననీ అన్నారు. కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించడం ఎవరి తరం కాదని వర్మ పేర్కొన్నారు.
