
డిసెంబర్ 26, 2025 11:15AMన పోస్ట్ చేయబడింది
.webp)
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు విచారణ ముగిసింది. శుక్రవారం వేకువజామునే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయన్ని విడిచిపెట్టింది. అక్కడి నుంచి ఆయన నేరుగా ఇంటికి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ కేసులో 14 రోజుల పాటు కస్టోడియల్ విచారణ జరిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో రాజకీయ ప్రత్యర్థులు, కీలక నేతలు, వ్యాపారవేత్తలు, మీడియా ప్రతినిధులు తదితరుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారిక అనుమతులు లేకుండా, నిబంధనలను ఉల్లంఘిస్తూ నిఘా సాగినట్లు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమచారాన్ని రాజకీయ ప్రయో జనాల కోసం ఉపయోగిం చారనే ఆరోపణలు ఈ కేసుకు మరింత ప్రాధాన్యతనిస్తాయి. ఈ వ్యవహారంలో మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు పాత్రపై సిట్ దృష్టి సారించింది. ఇప్పటికే ఆయనను కస్టడీలోకి తీసుకొని విచారించిన అధికారులు, పలు కీలక ప్రశ్నలకు సమాధానాలు రాబట్టినట్లు సమాచారం.
ప్రభాకర్ రావు ను 14 రోజుల పాటు కస్టడీలకు తీసుకొని జరిపిన విచారణలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన సాంకేతిక వ్యవస్థ, పరంపర, ఎవరి అనుమతితో నిఘా సాగిందన్న దృశ్యాలను పరిశీలించారు. ఈ కేసులో మరికొందరు ఉన్నతాధికా రుల పాత్రపై కూడా సిట్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సిట్ అధికారుల దర్యాప్తులో భాగంగా రాష్ట్రంలోని రాజకీయ నేతల పేర్లు వెలుగులోకి రావడం ఈ కేసుకు రాజకీయ వేడి పెరిగింది. ఎంపీ ఈటెల రాజేందర్, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, హరీష్ రావు వంటి ప్రముఖ నేతల ఫోన్లు నిఘా పెట్టారా? అన్న కోణంలో సిట్ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు.
అదేవిధంగా అనేక ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రభావవంతమైన వ్యక్తుల ప్రసారాలపై కూడా నిఘా పెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సాక్షిగా మారిన ప్రముఖ సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్‌ను సిట్ ఇప్పటికే రెండు సార్లు విచారించింది. ఆయన ఫోన్ సంభాషణలు, వివిధ రాజకీయ, పారిశ్రామికవేత్తలతో జరిగిన కమ్యూనికేషన్ల వివరాలను అధికారులు ఆయన ముందు ఉంచారు. గత ప్రభుత్వం నిఘా పెట్టిన కొద్ది మంది ముఖ్యుల్లో ఆరా మస్తాన్ ఒకరని సిట్ భావిస్తున్నారు.
రానున్న రోజుల్లో మరికొందరు కీలక వ్యక్తులను విచారణకు పిలిచే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరితో నిఘా సాగిందన్న అంశం తేలితే, రాజకీయంగా మరియు పరిపాలన పరంగా ఈ కేసు సంచలనంగా మారే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసు చివరికి ఎవరి మెడకు చుట్టుకుంటుందన్న ఉత్కంఠ మధ్య, సిట్ విచారణపై రాష్ట్రం మొత్తం దృష్టిసారించింది.
