
నవంబర్ 8, 2025 10:01AMన పోస్ట్ చేయబడింది

శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం (నవంబర్ 7) రాత్రి నుంచి ప్రయాణికులు ఆందోళన చేస్తున్నారు. రాత్రి 11 గంటలకు వియత్నాం వెళ్లాల్సిన వన్ 984 విమానం సాంకేతిక లోపం కారణంగా చెబుతూ తీవ్రజాప్యం కావడంతో ప్రయాణికుల ఆందోళన. శనివారం (నవంబర్ 8) ఉదయానికి కూడా విమానం ఎప్పుడు బయలుదేరుతుందన్న విషయాన్ని అధికారులు చెప్పకపోవడం, సమాచారం ఇవ్వకుండా సరైన బాధ్యత వహించడంతో దాదాపు 200 మంది ప్రయాణికులు రాత్రంతా ఎయిర్‌పోర్ట్‌లోనే పడిగాపులు పడుతున్నారు.
ఎప్పుడు టేక్‌ఆఫ్ అవుతుందనే విషయంపై సిబ్బంది స్పష్టమైన సమాచారం ఇవ్వకపోగా ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా శనివారం (నవంబర్ 8) ఉదయం కూడా పలు విమానాలు రద్దు కావడం, టేకాఫ్ కు తీవ్ర జాప్యం జరగడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళనలతో ఉద్రిక్తత నెలకొంది.
హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఇండిగో 6I051, అలాగే ముంబైకి వెళ్లాల్సిన 6I245 వి మానాలు రద్దు కాగా, పలు విమానాలు ఆలస్యం అయ్యాయి. దీనితో ప్రయాణికులు ఎయిర్‌లైన్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికారులు సరైన వివరణ ఇవ్వకపోవడం పట్ల ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
శుక్రవారం (నవంబర్ 7) ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య మరువక ముందే ఇవాళ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానాల రద్దు, జాప్యం జరుగుతుండటంతో అసలేం జరుగుతోందంటూ ప్రయాణికులు అధికారులను నిలదీస్తున్నారు.
